ట్రోపోస్ఫియర్
From Wikipedia, the free encyclopedia
ట్రోపోస్పియర్, భూమి వాతావరణంలో అన్నిటి కంటే కింద ఉండే పొర. గ్రహ వాతావరణపు మొత్తం ద్రవ్యరాశిలో 75% ఇందులోనే ఉంటుంది. నీటి ఆవిరి, ఏరోసోల్స్ల మొత్తం ద్రవ్యరాశిలో 99% ఇందులో ఉంటుంది. చాలా వాతావరణ దృగ్విషయాలు సంభవించేది ఇక్కడే. [1] భూగ్రహ ఉపరితలం నుండి ట్రోపోస్పియర్ సగటు ఎత్తు - ఉష్ణమండల అక్షాంశాల్లో 18 km (11 mi; 59,000 ft); మధ్య అక్షాంశాలలో 17 km (11 mi; 56,000 ft); శీతాకాలంలో ధ్రువ ప్రాంతాలలో 6 km (3.7 mi; 20,000 ft) ఉంటుంది. మొత్తమ్మీద ట్రోపోస్పియర్ సగటు ఎత్తు 13 km (8.1 mi; 43,000 ft).
ట్రోపోస్పియర్ అనే పదం గ్రీకు పదాలైన ట్రోపోస్ (భ్రమణం), స్పైరా (గోళం) నుండి ఉద్భవించింది. భ్రమణం వలన కలిగే కల్లోలం గాలి పొరలను సమ్మిళితం చేసి, ట్రోపోస్పియర్ నిర్మాణాన్ని, దృగ్విషయాలను నిర్దేశిస్తుంది. [2] గ్రహ ఉపరితలానికి వ్యతిరేకంగా ట్రోపోస్పియర్ భ్రమణం వలన కలిగే ఘర్షణ గాలి ప్రవాహాన్ని ప్రభావితం చేసి, తద్వారా వందల మీటర్ల నుండి 2 km (1.2 mi; 6,600 ft) వరకు ఎత్తులో ఉండే ప్లానెటరీ సరిహద్దు పొర (PBL)ను ఏర్పరుస్తుంది. PBL కొలతలు అక్షాంశం, నేల ఆకారం, వాతావరణ కొలతలను తీసిన సమయం వగైరాలను బట్టి మారుతూ ఉంటాయి. ట్రోపోస్పియర్ పైన ట్రోపోపాజ్ ఉంది. ఇది స్ట్రాటోస్ఫియరు నుండి ట్రోపోస్పియర్ను వేరుచేసే క్రియాత్మక వాతావరణ సరిహద్దు. అలాగే, ట్రోపోపాజ్ అనేది ఒక విలోమ పొర, దీనిలో ఎత్తు పెరిగే కొద్దీ గాలి ఉష్ణోగ్రత పెరుగుతుంది. ట్రోపోస్పియరు ఉష్ణోగ్రత స్థిరంగా ఉంటుంది. [2] ఈ పొరలో నత్రజని సాంద్రత అత్యధికంగా ఉంటుంది.