సత్వర హృద్ధమని వ్యాధులు
From Wikipedia, the free encyclopedia
హృదయానికి మిగిలిన అవయవాల వలె ప్రాణవాయువు, పోషకపదార్థాలు అందించుటకు రక్తప్రసరణ అవసరం. హృదయం నిరంతరంగా జీవితకాలం అంతా తోడు యంత్రంగా పనిచేయాలి. అందువలన దానికి నిరంతరం రక్తప్రసరణ చేకూరాలి. వామ (ఎడమ), దక్షిణ (కుడి) హృద్ధమనులు హృదయానికి రక్తం కొనిపోతాయి. హృత్సిరలు రక్తంను తిరిగి హృదయంలో కుడికర్ణికకు చేరుస్తాయి.
హృదయానికి రక్తప్రసరణ తగినంత లోపిస్తే గుండెనొప్పి, ఆ లోపం చాలా తీవ్రం అయితే గుండెపోటు కలుగుతాయి. గుండెపోటు కలిగినపుడు కొంత హృదయ కండర కణజాలం రక్తప్రసరణ లేక ‘ప్రసరణరహిత మరణం (ఇన్ ఫార్క్షన్)’పొందుతుంది[1]. అందువలన ప్రాణనష్టంతో బాటు ఇతర ఉపద్రవాలు కలిగే అవకాశం ఉంది. ప్రపంచంలో 30 శాతపు మరణాలు హృదయ రక్తప్రసరణ లోపాల వలన కలుగుతాయి.