సహజ ఉపగ్రహం
From Wikipedia, the free encyclopedia
ఒక గ్రహం లేదా చిన్న గ్రహం చుట్టూ పరిభ్రమించే ఖగోళ వస్తువును సహజ ఉపగ్రహం అంటారు. భూమికి ఉన్న సహజ ఉపగ్రహం పేరు చంద్రుడు. ఉపగ్రహాలన్నిటినీ మామూలుగా చంద్రుడు అని అనడం కూడా కద్దు. సౌర కుటుంబంలో ఆరు గ్రహ వ్యవస్థలున్నాయి. అన్నిటిలోనూ కలిపి 185 ఉపగ్రహాలున్నాయి.[1][2] ఇవి కాకుండా ప్లూటో, హామియా, మాకెమాకె, ఎరిస్ అనే నాలుగు మరుగుజ్జు గ్రహాలకు కూడా ఉపగ్రహాలున్నాయి.[3] 2018 సెప్టెంబరు నాటికి తెలిసిన దాని ప్రకారం 334 చిన్న గ్రహాలకు ఉపగ్రహాలున్నాయి.[4]
ఈ వ్యాసం సహజ ఉపగ్రహం గురించి. మానవుడు అంతరిక్షం లోకి పంపే ఉపగ్రహాల కొరకు, కృత్రిమ ఉపగ్రహం చూడండి.
సౌరకుటుంబంలో భూమి-చంద్రుడు వ్యవస్థకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ రెండింటి ద్రవ్యరాశి నిష్పత్తి, మరే ఇతర పెద్ద గ్రహ-ఉపగ్రహ ద్రవ్యరాశుల నిష్పత్తి కన్నా చాలా ఎక్కువ. (అయితే, ప్లూటో-చరోన్ వంటి చిరు గ్రహవ్యవస్థలు కొన్నిట్లో ఈ నిష్పత్తి ఇంకా ఎక్కువ ఉంది.). చంద్రుడి వ్యాసం (3,474 కి.మీ.) భూమి వ్యాసంలో 0.27 రెట్లుంది.[5]