శ్రీ కృష్ణుడు
హిందూ దేవుడు, విష్ణు అవతారం / From Wikipedia, the free encyclopedia
శ్రీకృష్ణుడు, హిందూమతంలో అర్చింపబడే ఒక దేవుడు. విష్ణువు పది అవతారాలలోఎనిమిదవ అవతారము. హిందూ పురాణాలలోను, తాత్త్విక గ్రంథాలలోను, జనబాహుళ్యంలోని గాథలలోను, సాహిత్యంలోను, ఆచార పూజా సంప్రదాయాలలోను కృష్ణుని అనేక విధాలుగా భావిస్తుంటారు, చిత్రీకరిస్తుంటారు. చిలిపి బాలునిగాను,రాధా గోపికా మనోహరునిగాను, రుక్మిణీ సత్యభామాది అష్టమహిషుల ప్రభువుగాను, గోపికల మనసు దొచుకున్నవాడిగాను యాదవరాజుగాను, అర్జునుని సారథియైన పాండవ పక్షపాతిగాను, భగవద్గీతా ప్రబోధకునిగాను, తత్త్వోపదేశకునిగాను, దేవదేవునిగాను, చారిత్రిక రాజనీతిజ్ఞునిగాను ఇలా బహువిధాలుగా శ్రీకృష్ణుని రూపం, వ్యక్తిత్వం, దైవత్వం చిత్రీకరింపబడినాయి.[1][2][3]. మహాభారతం, హరివంశం, భాగవతం, విష్ణుపురాణం - ఈ గ్రంథాలు కృష్ణుని జీవితాన్ని, తత్త్వాన్ని తెలిసికోవడానికి హిందువులకు ముఖ్యమైన ధార్మిక గ్రంథాలు.
కృష్ణుడు | |
---|---|
దేవనాగరి | कृष्ण |
కన్నడ | ಕೃಷ್ಣ |
తమిళ లిపి | கிருஷ்ணர் |
సంప్రదాయభావం | విష్ణువు పూర్ణావతారం |
ఆవాసం | బృందావనం, ద్వారక, |
మంత్రం | श्री कृष्णः शरणं ममः, ॐ नमो भगवते वासुदेवाय |
ఆయుధం | సుదర్శన చక్రం |
భార్య | రుక్మిణి, సత్యభామ, జాంబవతి, నాగ్నజితి, లక్షణ, కాళింది, భద్ర, మిత్రవింద. |
వాహనం | గరుత్మంతుడు |
గ్రంధాలు | భాగవతం, భగవద్గీత |
హిందూమతంలో, ప్రత్యేకించి వైష్ణవులలో కృష్ణునిపూజ దేశమంతటా చాలా ముఖ్యమైనది. మథురలో బాలకృష్ణునిగా, పూరీలో జగన్నాథునిగా, మహారాష్ట్రలో విఠోబాగా, రాజస్థాన్లో శ్రీనాధ్జీగా, తిరుమలలో వేంకటేశ్వరునిగా, ఉడిపిలో కృష్ణునిగా, గురువాయూరులో గురువాఐరోపాపగా కృష్ణుని పూజిస్తారు. ఇంతే కాకుండా కృష్ణుని ఆలయాలు, విష్ణువు ఆలయాలే అనవచ్చును. ఇందుకు అనుగుణంగా దేశంలో వివిధ ప్రాంతాలలోను, వర్గాలలోను అనేక సంప్రదాయాలు నెలకొన్నాయి. వీటిలో ప్రధానమైన భావం:
శ్రీమహా విష్ణువు తన సృష్టి లోని జీవులకు బాధలు హెచ్చినప్పుడు, లోకంలో పాపం హద్దు మీరినప్పుడు, దుష్టులను శిక్షించి, శిష్టులను రక్షించడం కోసం జీవుల రూపంలో అవతరించి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేస్తూ ఉంటాడు. ఈవిధంగా అవతరించడాన్నిలీలావతారం అంటారు. ఇలాంటి లీలావతారాలు, భాగవతం ప్రకారం, భగవంతునికి ఇరువది రెండు (22) ఉన్నాయి. శ్రీమహావిష్ణువు లీలావతారాలలో ఇరువది ఐదవ అవతారం శ్రీకృష్ణావతారం. ఈ లీలావతారాలు ఇరవైరెండింటి లోనూ ముఖ్యమైనవి పది ఉన్నాయి. ఈ పదింటిని దశావతారాలు అంటారు. దశావతారాలలో శ్రీకృష్ణావతారం కొన్నిచోట్ల చెప్పబడుతుంది. కొన్నిచోట్ల చెప్పారు. ("రామోరామశ్చరామశ్చ"). యుగాలలో రెండవదయిన త్రేతాయుగంలో శ్రీరాముని లోక కళ్యాణ కారకునిగ రావణాది రాక్షస శిక్షకుడుగా కీర్తించబడుతున్నాడు. నారాయణుడు ఆ తర్వాతదయిన ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిగా అవతరించాడు. శ్రీకృష్ణుడు నారాయణుడి అవతారాల్లో పరిపూర్ణావతారంగా కొలవబడుతున్నాడు. గీతోపదేశం ద్వారా అర్జునుడికి సత్యదర్శనం చేసి, కురుక్షేత్ర మహాసంగ్రామాన్ని ముందుకు నడిపించాడు. ఆ విధంగా భగవద్గీతను లోకానికి ఉపదేశించి శ్రీకృష్ణుడు జగద్గురువు అయ్యాడు.